
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంపుకోసం ప్రత్యేక కార్యాచరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన,విద్యాశాఖ అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పదో తరగతిలో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరీక్షించే ముందు వారికి చదువుపట్ల ఆసక్తిని పెంచడం లక్ష్యంగా తీసుకొని గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. సబ్జెక్టులు, అభ్యసనాలపై పరీక్షలు నిర్వహించి మార్కుల ఆధారంగా ABCDలుగా వర్గీకరించారు C, D గ్రేడ్ వచ్చిన విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధతో అభ్యసించేందుకు ఉపాధ్యాయులను ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిని రెండు వారాల వ్యవధిలో సమీక్షిస్తూ, క్లియర్ నివేదికలు సమర్పిస్తున్నారు.
వివరాలు
బలాలు.. బలహీనతలు గుర్తించి...
తొమ్మిదో తరగతి విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. కలెక్టర్ హరిచందన పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ,ప్రత్యక్షంగా విద్యార్థులతో ముచ్చటించి చదువు మీద శ్రద్ధ ఎలా పెంపొందించుకోవాలో సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్న షిఫ్ట్ పాఠశాలలు,సదుపాయాల లోపంపై కూడా పరోక్షంగా గమనిస్తున్నారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని పరీక్షించనున్నారు.
వివరాలు
తల్లిదండ్రులతో సమావేశాలు
C, D గ్రేడ్ పొందిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసి వారిని ఇతర విద్యార్థుల సమాన స్థాయిలో అభ్యసించేందుకు చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి మద్దతును పొందాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా వారిని అవసరమైన సూచనలు, మార్గదర్శకాలతో అవగాహన చేయనున్నారు.