LOADING...
Great Nicobar Airport: గ్రేట్ నికోబార్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్
గ్రేట్ నికోబార్‌లో రూ.13 వేల కోట్ల ఎయిర్‌పోర్ట్.. కేంద్రం అనుమతి

Great Nicobar Airport: గ్రేట్ నికోబార్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది. సుమారు రూ.13 వేల కోట్ల వ్యయంతో పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే ఈ విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ నావికాదళ ఎయిర్‌స్టేషన్‌ను విస్తరించే ప్రతిపాదనను భౌగోళిక కారణాలతో ప్రభుత్వం విరమించుకుంది. రూ.81 వేల కోట్లతో ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ (GNI) అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ విమానాశ్రయం నిర్మించబడనుంది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టడం ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

చింగెన్ ప్రాంతంలో కొత్త ఎయిర్‌పోర్ట్

పౌర, సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని గలాథియా బే సమీపంలోని చింగెన్ ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ ఎయిర్‌స్టేషన్ వద్ద రన్‌వే విస్తరణకు భౌగోళిక పరిమితులు అడ్డంకిగా మారడంతో కొత్త విమానాశ్రయం నిర్మాణాన్ని కేంద్రం ఎంచుకుంది. రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

మలక్కా జలసంధిపై భారత్ దృష్టి

గ్రేట్ నికోబార్ దీవి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. యుద్ధ నౌకలు, వైమానిక దళాల కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉండటం సముద్ర భద్రత, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి చైనాకు అవసరమైన సుమారు 80 శాతం చమురు, 70 శాతం సహజ వాయువు మలక్కా జలసంధి మీదుగానే రవాణా అవుతుండటంతో ఈ ప్రాంతంపై నిఘా పరంగా భారత్‌కు మరింత బలం చేకూరనుంది.

Advertisement

వివరాలు 

రూ.81 వేల కోట్ల మెగా ప్రాజెక్టు

గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద విమానాశ్రయంతో పాటు పలు కీలక మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. అండమాన్-నికోబార్ దీవులను ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పేర్కొంటోంది.

Advertisement

వివరాలు 

విపక్షాల విమర్శలు

అయితే ఈ ప్రాజెక్టుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ సహజ సంపద, గిరిజన వారసత్వానికి ఈ ప్రాజెక్టు ముప్పుగా మారుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుతో సుమారు 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షలాది చెట్లను తొలగించాల్సి వస్తుందని, అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, సముద్ర వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొంటోంది.

Advertisement