LOADING...
Dagadarthi: దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్‌.. భూసేకరణకు అనుమతి
దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్‌.. భూసేకరణకు అనుమతి

Dagadarthi: దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్‌.. భూసేకరణకు అనుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు జిల్లా దగదర్తిలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అదనపు భూసేకరణకు అనుమతి ఇచ్చింది. దామవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 1/1లో ఉన్న 418.14 ఎకరాల భూమిని సేకరించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. భూసేకరణకు ఎకరానికి రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం రూ.54.36 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. తదుపరి చర్యలు వేగంగా పూర్తి చేయాలని ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ఎండీతో పాటు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Details

45 సంవత్సరాల పాటు అమలులో ఉండేలా రాయితీ

ఈ మేరకు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక కార్యకలాపాలు, పర్యాటక రంగం క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా గణనీయంగా పెరుగుతాయని ఏపీఏడీసీఎల్‌ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు వల్ల కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలతో పాటు పరిశ్రమలకు కూడా ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని పేర్కొంది. విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు చేపట్టే సంస్థతో ప్రభుత్వం 45 సంవత్సరాల పాటు అమలులో ఉండేలా రాయితీ ఒప్పందం కుదుర్చుకోనుంది.

Details

భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం

ఈ కాలాన్ని ప్రతి 15 సంవత్సరాలను ఒక దశగా పరిగణించి ప్రాజెక్టు అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ప్రతిపాదించింది. మొదటి దశలో ప్రయాణికులు, కార్గో డిమాండ్‌ తక్కువగా ఉంటుందని, రెండో దశలో డిమాండ్‌ క్రమంగా పెరుగుతుందని, మూడో దశలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీ, సరకు రవాణా అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయ నిర్మాణానికి చేసిన మూలధన ఖర్చును సర్దుబాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించనున్నారు.

Advertisement