డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన లోక్‌సభ
దేశపౌరుల డిజిటల్ హక్కుల్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఆగస్టు 3న కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే విపక్షాల నిరసన మధ్యే ఈ బిల్లుపై ఓటింగ్ చేపట్టి ఆమోదించారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ 2023 ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఓ సంస్థ సేకరించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సమాచార దుర్వినియోగానికి పాల్పడితే రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
మూజువాణి పద్ధతిలో బిల్లుకు ఆమోదం
ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును గతవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. నేడు దీనిపై చర్చ జరగ్గా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓవైపు విపక్షాల నిరసన కొనసాగుతుంటే మరోవైపు మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలిపారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో ప్రైవసీ రక్షణ నుంచి మినహాయింపులు ఉండనున్నాయి. ముఖ్యంగా దేశ సార్వభౌమత్వం, సమైఖ్య విషయంలో ఇది వర్తించదు.