
Srisailam elevated corridor: హైదరాబాద్-శ్రీశైలం నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్‌హెచ్-765లోని హైదరాబాద్-శ్రీశైలం విభాగంలో నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును సుమారు రూ.7,668 కోట్ల వ్యయంతో అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఈ కారిడార్ రావడం వల్ల పర్యావరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఒక దశలో భూగర్భ రహదారి ఏర్పాటు చేయొచ్చన్న చర్చ కూడా జరిగింది. అయితే ఆ ప్రతిపాదనలను పక్కనపెట్టి, స్వల్ప మార్పులతో గతంలో సూచించిన ఎలివేటెడ్ కారిడార్‌కే కేంద్రం త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Details
45 నిమిషాల పాటు ప్రయాణ సమయం తగ్గే అవకాశం
ఈ కారిడార్ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూరు మీదుగా శ్రీశైలం పాతాళగంగ వరకు, 30 అడుగుల ఎత్తులో నాలుగు వరుసల రహదారిగా నిర్మించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతంలో సుమారు 300 మీటర్ల భాగాన్ని వయాడక్ట్‌గా తీర్చిదిద్దనున్నారు. ప్రాజెక్టు పూర్తయితే నల్లమల అటవీ ప్రాంతం నుంచి నేరుగా శ్రీశైలానికి వెళ్లే సౌకర్యం కలుగుతుంది. అలాగే, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాలు తగ్గుతుంది. దోమలపెంట-శ్రీశైలం మధ్య సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది.
Details
ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన వివరాలు
* ప్రతిపాదిత పొడవు: 54.915 కి.మీ. * ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 45.19 కి.మీ. * ఎట్-గ్రేడ్ రహదారి పొడవు: 9.725 కి.మీ. * మొత్తం భూసేకరణ: 148 హెక్టార్లు * అటవీ భూమి: 129 హెక్టార్లు * అటవీయేతర భూమి: 19 హెక్టార్లు