LOADING...
Hyderabad Metro: మెట్రో టేకోవర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. నెలాఖరుకల్లా ప్రభుత్వ చేతుల్లోకి!
మెట్రో టేకోవర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. నెలాఖరుకల్లా ప్రభుత్వ చేతుల్లోకి!

Hyderabad Metro: మెట్రో టేకోవర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. నెలాఖరుకల్లా ప్రభుత్వ చేతుల్లోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రోరైలు తొలి దశ స్వాధీనం దిశగా కీలక ముందడుగు పడింది. దాదాపు రూ.13,615 కోట్ల భారీ రుణాన్ని అందించేందుకు ఐఆర్‌ఎఫ్‌సీ అంగీకరించగా, దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలు, డాక్యుమెంట్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 30 నాటికి మెట్రోరైలు ప్రాజెక్ట్‌ ప్రభుత్వ పరం కావడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం ఎల్&టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ నిర్మించి నిర్వహిస్తోంది. స్వాధీన ప్రక్రియకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులు,పలు ఆర్థిక-పరిపాలన అంశాలను గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోదించారు. షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌, ఐఆర్‌ఎఫ్‌సీ రుణం, ప్రభుత్వ అండర్‌టేకింగ్‌ లేఖ, గ్యారంటీ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

వివరాలు

20 ఏళ్లలో రుణ చెల్లింపు

ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి పొందనున్న రూ.13,615 కోట్ల రుణాన్ని మెట్రో సంస్థ 20 ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలో ఐఆర్‌ఎఫ్‌సీ అంగీకరించిన రూ.12,750 కోట్ల కంటే ఈసారి ఎక్కువ మొత్తానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రుణానికి సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందం అవసరమని సంస్థ సూచించింది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌, బడ్జెట్‌ మద్దతు వంటి షరతులను కూడా పేర్కొంది. అయితే ఈ నిబంధనల్లో కొన్ని తొలగించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ కోరడంతో ఐఆర్‌ఎఫ్‌సీ అంగీకరించింది.

వివరాలు

రూ.15 వేల కోట్లతో టేకోవర్

మెట్రో తొలి దశను సుమారు రూ.15 వేల కోట్ల వ్యయంతో (అప్పుతో కలిపి) ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో రూ.13 వేల కోట్ల రుణాలు, రూ.2 వేల కోట్ల ఈక్విటీ ఉన్నాయి. 100 శాతం ఈక్విటీతో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ద్వారా ప్రభుత్వం టేకోవర్‌ చేపట్టనుంది. లావాదేవీ తేదీని ఈ నెల 30గా నిర్ణయించారు. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ప్రధాన రుణం రానుండగా, మిగిలిన నిధులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ సమకూర్చనుంది. గడువులోగా లావాదేవీ పూర్తి కావాలంటే తక్షణ నిధుల విడుదల అవసరమని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

వివరాలు

ఉద్యోగుల కొనసాగింపు

మెట్రో స్వాధీనం తర్వాత నిర్వహణలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు చెందిన 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఇందుకు అయ్యే రూ.24.3 కోట్ల వేతన భారం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ భరిస్తుంది. అదనంగా ఆపరేషనల్‌ సలహాల కోసం ఎల్‌అండ్‌టీకి చెందిన ఏడుగురు సీనియర్‌ నిపుణులను 6 నెలల పాటు వినియోగించనున్నారు. వీరి ఖర్చును ఎల్‌అండ్‌టీనే భరిస్తుంది.

Advertisement

వివరాలు

వడ్డీ భారం కూడా ప్రభుత్వానికే

లావాదేవీ ముగిసే తేదీ (2026 ఏప్రిల్‌ 30) తర్వాత, మే 1 నుంచి జూన్‌ 1 మధ్య గడువు ముగిసే కమర్షియల్‌ పేపర్లపై రూ.10.47 కోట్ల వడ్డీని తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సులు ఎల్‌అండ్‌టీకి గతంలో ఇచ్చిన రూ.900 కోట్ల వడ్డీలేని రుణం నికర ప్రస్తుత విలువ (ఎన్‌పీవీ) రూ.366.92 కోట్లుగా లెక్కించి, టేకోవర్‌ మొత్తం రూ.15 వేల కోట్ల నుంచి ఈ మొత్తాన్ని మినహాయించాలని సూచించింది. ఈ రుణాన్ని గడువు ముగిసే వరకు ఎల్‌అండ్‌టీ ఖాతాలోనే బకాయిగా కొనసాగించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను బకాయిలపై ఎల్‌అండ్‌టీ నుంచి ఇండెమ్నిటీ అవసరం లేదని తెలిపింది.

వివరాలు

పెండింగ్‌లో జీఎస్‌టీ క్లెయిమ్‌లు

అయితే స్టాంప్‌ & రిజిస్ట్రేషన్‌ శాఖకు రూ.123.95 కోట్లు, కార్మికశాఖకు లేబర్‌ సెస్‌గా రూ.163.74 కోట్లు, ఎస్పీడీసీఎల్‌కు రూ.15.38 కోట్లు, జీహెచ్‌ఎంసీ ప్రకటన పన్నులుగా రూ.75.15 కోట్లకు ఎల్‌అండ్‌టీ నుంచి ఇండెమ్నిటీ తీసుకోవాలని సిఫార్సు చేసింది. పెండింగ్‌ కోర్టు కేసుల్లో ఎల్‌అండ్‌టీ ప్రాతినిధ్యం వహించేందుకు ప్రత్యేక పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకోవాలని సూచించింది. చట్టపరమైన మార్పులతో వచ్చే క్లెయిమ్‌లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాల అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని ప్రతిపాదనను ఆమోదించింది. రూ.254 కోట్ల సర్దుబాటు వ్యయ నిధి, జీఎస్‌టీ క్లెయిమ్‌లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

Advertisement