LOADING...
TGSRTC: ఆర్టీసీకి గ్రీన్‌సిగ్నల్‌.. సమ్మె ముగిసింది.. రోడ్లపైకి బస్సులు రైట్‌..రైట్
ఆర్టీసీకి గ్రీన్‌సిగ్నల్‌.. సమ్మె ముగిసింది.. రోడ్లపైకి బస్సులు రైట్‌..రైట్

TGSRTC: ఆర్టీసీకి గ్రీన్‌సిగ్నల్‌.. సమ్మె ముగిసింది.. రోడ్లపైకి బస్సులు రైట్‌..రైట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టీసీ ఐకాస నాయకులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రకటించారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. మిగతా సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు పరస్పరం చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. చర్చలు విజయవంతం కావడంతో బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

వివరాలు

డ్రైవర్ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం

శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చలతో మూడు రోజుల సమ్మెకు ముగింపు పలికినట్టైంది. శనివారం ఉదయం తొలి షిఫ్ట్‌ నుంచే బస్సులు రోడ్లపైకి రావనున్నాయి. ఈ సమావేశంలో ఐకాస నాయకులు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వ ముందుంచారు. సమావేశం ప్రారంభానికి ముందు నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యకు నివాళిగా మంత్రులు, అధికారులు, కార్మిక సంఘాల నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. డ్రైవర్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

వివరాలు

డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో ఐకాస ఛైర్మన్‌ ఈదురు వెంకన్నతో పాటు నాయకులు థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, హనుమంతు ముదిరాజ్‌, మౌలానా, మల్లేశ్‌ తదితరులు సచివాలయానికి హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కమిటీలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రారంభమైన చర్చలు భోజన విరామం వరకు కొనసాగాయి. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహా అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్‌కు వెళ్లి చర్చల సారాంశాన్ని వివరించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రధాన సమావేశం జరిగింది.

Advertisement

వివరాలు

కొంతసేపు విడిగా సమావేశమై అంతర్గతంగా చర్చలు జరిపిన మంత్రులు

ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, సీఎస్‌ రామకృష్ణారావు, కమిటీ ఛైర్మన్‌ వికాస్‌రాజ్‌, ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, దానకిశోర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ఐకాస నాయకులు తమ 32 డిమాండ్లను, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా ప్రస్తావించారు. ఒక్కో అంశాన్ని డిప్యూటీ సీఎం, మంత్రులకు సమగ్రంగా వివరించారు. మంత్రుల బృందం వాటిని సవివరంగా నోట్‌ చేసుకుంది. ఆర్టీసీ బోర్డు పరిధిలోకి వచ్చే సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులు కలిసి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రభుత్వం ఆర్టీసీకి అందిస్తున్న సహకారం, ఇప్పటికే పరిష్కరించిన అంశాలను వివరించారు. చర్చల మధ్యలో ఒకసారి టీ విరామం తీసుకోగా, మంత్రులు కొంతసేపు విడిగా సమావేశమై అంతర్గతంగా చర్చించారు.

Advertisement

వివరాలు

30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన పెంపు చేయాలి

ఐకాస నాయకులు 2021, 2025 వేతన సవరణలను అమలు చేయాలని, 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన పెంపు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంతకుముందు ఐకాస నాయకులతో మాట్లాడిన భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ శత్రువులుగా చూడదని, "ఇది మన ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం" అని స్పష్టం చేశారు. ఆర్టీసీ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అని, దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మరణం చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, కార్మిక సంఘాలు కలిసి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వివరాలు

కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదు

ఐకాస నాయకులు మాట్లాడుతూ, రెండు వేతన సవరణలు అమలు చేయడం, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం వంటి డిమాండ్లను ముందుంచారు. అలాగే యూనియన్లు లేకపోవడం వల్ల కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో 55 రోజుల సమ్మె జరిగినప్పటికీ హామీలు అమలు కాలేదని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2013 వేతన సవరణ బాండ్ల కింద రూ.280 కోట్ల బకాయిలను చెల్లించడం, 2017 పీఆర్సీ, పెండింగ్‌ డీఏలను చెల్లించడం వంటి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

Advertisement