Amaravati: రాజధాని అమరావతిలో మరో అంతర్జాతీయ విద్యాసంస్థ.. జీఎస్‌జీ భారీ ప్రణాళికలు
ఈ వార్తాకథనం ఏంటి
సింగపూర్‌కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్ స్కూల్ గ్రూప్ (జీఎస్‌జీ) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తమ విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జీఎస్‌జీ ఛైర్మన్ అతుల్ తెముర్నికర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో చేపట్టబోయే విద్యా ప్రాజెక్టు వివరాలను ఆయన సీఎంకు వివరించారు. జీఎస్‌జీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (జీఐఐఎస్) పేరుతో అమరావతిలో అత్యాధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం శాఖమూరు ప్రాంతంలో సీఆర్‌డీఏ ఇప్పటికే నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టుతో రాజధానిలో అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
వివరాలు
రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందుకునే అవకాశం
అతుల్ తెముర్నికర్‌తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, అందులో నాణ్యమైన విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జీఐఐఎస్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థ అమరావతికి రావడం సంతోషకరమని, రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జీఎస్‌జీ ఛైర్మన్ అతుల్ తెముర్నికర్ మాట్లాడుతూ.. అమరావతిలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఇన్నోవేషన్, ప్రతిభ, అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి తమ సంస్థ కూడా సహకరిస్తుందని తెలిపారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన సదుపాయాలు, ఆధునిక విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
వివరాలు
క్యాంపస్ ఏర్పాటుకు జీఎస్‌జీ రూ.100 కోట్ల పెట్టుబడి
అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు జీఎస్‌జీ సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 64 క్యాంపస్‌లు ఉన్నాయి. భారత్‌లో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఇప్పటికే 11 క్యాంపస్‌లు నిర్వహిస్తుండగా, అమరావతిలో ఏర్పాటు చేయనున్నది దేశంలో 12వ క్యాంపస్‌గా నిలవనుంది. కాగా, అమరావతిలో అంతర్జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు వేగం పుంజుకుంటోంది. ఇటీవలే బ్రిటన్‌కు చెందిన బెడ్‌ఫోర్డ్ స్కూల్ కూడా రాజధానిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఆ సంస్థకు సీఆర్‌డీఏ ఎనిమిది ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో అమరావతి అంతర్జాతీయ విద్యా కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా మరో కీలక అడుగు పడినట్లు భావిస్తున్నారు.