
AP Vahanamitra: వాహనమిత్ర పథకానికి మార్గదర్శకాలు విడుదల.. అర్హతలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు దసరా కానుకను ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రకారం వాహనమిత్ర పథకం కింద అర్హులైన డ్రైవర్లకు రూ.15,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సాయం ద్వారా ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, వాహన రిపేర్ వంటి ఖర్చులను నిర్వర్తించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
అర్హతలు ఇలా ఉన్నాయి
చెల్లుబాటు అయ్యే ఏపీ ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్ అయి ఉండాలి. ఆటోలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోయినా ఈ సారి అనుమతిస్తారు, అయితే ఒక నెలలోపు పొందాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు లేదా రేషన్ కార్డు కలిగి ఉన్నవారే అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారరు. కానీ పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇవ్వబడింది. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. వ్యవసాయ భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకుపైగా నివాసం లేదా వాణిజ్య భవనం ఉండకూడదు. వాహనానికి పెండింగ్ బకాయిలు, చలాన్లు లేకపోవాలి.
Details
దరఖాస్తుల షెడ్యూల్
ఈ నెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్త లబ్ధిదారులు 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్షేత్ర పరిశీలన అనంతరం 24వ తేదీ నాటికి తుది జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1న అర్హులైన డ్రైవర్ల బ్యాంక్ ఖాతాల్లో నిధులను సీఎం చంద్రబాబు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆర్థిక లాభాన్ని పొందనున్నారు.