
Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గుజరాత్‌లోని పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఈ క్రమంలో అయన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
విజాపూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే స్పీకర్ శంకర్ చౌదరికి చావడా రాజీనామా సమర్పించినట్లు రాష్ట్ర అసెంబ్లీ అధికారి తెలిపారు.
విజాపూర్ నియోజకవర్గం నుంచి సీజే చావడా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాజీనామా అనంతరం చావడా మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్
అసెంబ్లీలో 15కు పడిపోయిన కాంగ్రెస్ సభ్యుల సంఖ్య
గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 182 మంది కాగా.. చావడా రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 15కు పడిపోయింది.
గతంలో ఆనంద్ జిల్లాలోని ఖంభాట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరాగ్ పటేల్ కూడా రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.
ఇప్పుడు చావడా కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రామాలయంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక జనవరి 22న జరగనుంది.
మరుసటి రోజు ఆలయాన్ని ప్రజల కోసం తెరవాలని భావిస్తున్నారు.