Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వానలు.. 36 గంటల్లో 1,200 మి.మీ. వర్షపాతం
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. గురువారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసిన 36 గంటల వ్యవధిలో జిల్లాలోని ఉంబెర్‌గావ్ తాలూకాలో ఏకంగా 1,200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమై, సాధారణ జీవనం పూర్తిగా స్తంభించింది. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 1,200 మందిని ఎన్డీఆర్‌ఎఫ్,ఎస్డీఆర్‌ఎఫ్ సహా సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వివరాలు
గుజరాత్‌లోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్
వల్సాద్‌తో పాటు నవ్‌సారీ జిల్లాలు వరదల ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి.
అలాగే సూరత్, అహ్మదాబాద్, ఖేడా, తాపీ, డాంగ్స్ జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమైంది.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరించింది.
వర్షాల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో గుజరాత్‌లోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
వివరాలు
అస్సాంలో వరదల తీవ్రత.. త్వరలో కేంద్ర బృందాలు
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అస్సాంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
రాష్ట్రంలోని 10 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా, దాదాపు ఆరు లక్షల మంది వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఒకటి లేదా రెండు రోజుల్లో కేంద్ర బృందాలను పంపనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
ఈ మేరకు ఆయన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఇప్పటికే వరదల కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 80 మంది గల్లంతైనట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.