ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్
బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో పోర్ బందర్‌కు నైరుతి వైపు దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో బిపర్‌జాయ్ కేంద్రీకృతమై ఉంది. గురువారం సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను నేపథ్యంలో గుజరాత్ సర్కార్ హై అలెర్ట్ ప్రకటించింది. అయితే మంగళవారం గుజరాత్ అధికారులు తీర ప్రాంతాల్లోని సుమారు 30 వేల మందిని సేఫ్ జోన్లకు తరలించారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు విపత్తు నిర్వహణ బృందాలను ఇప్పటికే సిద్ధం చేయగా, తాజాగా సైన్యం కూడా రంగంలోకి దిగనుంది.
బిపర్‌జాయ్ తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మంగళవారం గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్, సీనియర్ ఉన్నతాధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో సహాయక చర్యలకు ఏ మేర ఏర్పాట్లు చేశారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రెండు విడతల్లో గుజరాత్ ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను నిర్వహించనుంది. తొలి విడత : తీరానికి 5 కిలోమీటర్ల లోపు ఉన్నవారందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రెండో విడత : తీరానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వారిని తరలిస్తారు. సహాయక చర్యల కోసం 17 కేంద్ర, 12 రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను సంసిద్ధం చేశారు.