Loading...
Gujarat: వాహనాలపై కుల సూచికలు, స్టిక్కర్ల ప్రదర్శనపై గుజరాత్ ప్రభుత్వం నిషేధం
వాహనాలపై కుల సూచికలు, స్టిక్కర్ల ప్రదర్శనపై గుజరాత్ ప్రభుత్వం నిషేధం

Gujarat: వాహనాలపై కుల సూచికలు, స్టిక్కర్ల ప్రదర్శనపై గుజరాత్ ప్రభుత్వం నిషేధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ వాహనాలపై కులాలను సూచించే పదాలు,స్టిక్కర్లు,చిహ్నాలను ప్రదర్శించడంపై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ద్విచక్ర వాహనాలు,ఆటోలు,కార్లు,బస్సులు,ట్రక్కులు సహా అన్ని రకాల ప్రైవేట్ వాహనాలపై కుల సంబంధిత పేర్లు, గుర్తులు, బొమ్మలు, రాతలను ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. వాహనాల నంబర్ ప్లేట్లు,విండ్‌షీల్డ్‌లు మాత్రమే కాకుండా.. వాహనం బాడీపై ఎక్కడా ఇటువంటి గుర్తులు, స్టిక్కర్లు ఉండకూడదని నిషేధం విధించింది. ఈ మేరకు 'గుజరాత్ మోటార్ వాహనాల నిబంధనలు-1989'కు సవరణలు చేసింది. రాష్ట్ర ఓడరేవులు, రవాణా శాఖ 2026 నవంబర్ 17న 'గుజరాత్ మోటార్ వెహికల్స్ (మూడో సవరణ) నిబంధనలు-2026' పేరుతో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సవరణల ద్వారా వాహనాలపై కుల ఆధారిత గుర్తులు, రాతల ప్రదర్శనను నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చింది.

వివరాలు 

నిబంధన 138కు కొత్తగా ఉప నిబంధన (3)

ఇందులో భాగంగా నిబంధన 125లోని ఉప నిబంధన (1) కింద కుల సంబంధిత గుర్తులను కూడా ప్రకటనల పరికరాల నియంత్రణ పరిధిలో చేర్చారు.

అలాగే నిబంధన 138కు కొత్తగా ఉప నిబంధన (3)ను జోడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అనుమతి ఇచ్చిన సందర్భాలు మినహా.. వాహనాలపై ఎలాంటి కుల సంబంధిత చిహ్నాలు, పదాలు, రాతలను ప్రదర్శించడానికి వీల్లేదని ఇందులో స్పష్టం చేశారు.

అయితే అవసరాన్ని బట్టి సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కొన్ని మినహాయింపులు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది.

వివరాలు 

అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు 30 రోజుల గడువు

కాగా, ఈ నిబంధనలకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం తొలుత 2026 జూన్ 11న అసాధారణ గెజిట్‌లో ప్రచురించింది.

దీనిపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది.

అయితే నిర్ణీత సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా సూచనలు అందలేదు.

దీంతో ప్రతిపాదిత మార్పులను తుది నిబంధనలుగా ఖరారు చేసిన ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ADVERTISEMENT