Kurnool: కర్నూల్ జిల్లాలో గన్ కలకలం..తుపాకీతో వ్యక్తిని బెదిరించిన ఓ వర్గం
కర్నూలు జిల్లాలో గన్ కలకలం చెలరేగింది. జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం పెద్ద తుంబలం గ్రామంలోని పెద్దు ఉరుకుందు వర్గానికి, మరో వర్గానికి మధ్య హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం (Land dispute) ఉంది. ఆక్రమణ దారులు, ఓ రిటైర్డ్ పోలీసు అధికారి మరికొందరు కలసి పొలం దగ్గరికి వచ్చి పంచాయతీ చేసుకోవాలని గన్ తో బెదిరించారు. దీంతో బాధితులు పోలీస్ కేసు పెట్టారు.అయితే పోలీసులు మాత్రం కేవలం ఆక్రమణదారులపైనే కేసు నమోదు చేశారని, ఆక్రమణదారులతోపాటు వారి వెంట వచ్చి గన్ తో బెదిరించిన వారిపై కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపాకీని స్థానిక పీఎస్లో డిపాజిట్ చేయాలి...
ఎన్నికల నేపథ్యంలో గన్ లైసెన్స్ ఉన్న వారు తమ తుపాకీని తీసుకొచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. రిటైర్డ్ పోలీస్ అధికారితో పాటు గన్ తీసుకువచ్చిన వ్యక్తికి అసలు గన్ లైసెన్స్ ఉందా? లేదా? అని చర్చ జరుగుతోంది. పోలీసులు ఈ ఘటనపై మరిన్నివివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో పార్కింగ్ విషయమై ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఒక లారీ డ్రైవర్ తుపాకీతో అవతలి వ్యక్తి ని బెదిరించాడు. పోలీసులు ఆ వ్యక్తి నుంచి తుపాకీని, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.