గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కాబోయే ఇంజినీర్లు ఘర్షణ పడ్డారు. ఇంజినీరింగ్ విద్యకు ప్రసిద్ధి గాంచిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీలో ఒకరినొకరు దూషించుకుంటూ విద్యార్థులు గొడవ పడ్డారు. ఏకంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే సీనియర్‌లు, జూనియర్‌లు అంటూ విడిపోయి భీకరంగా పోట్లాడుకున్నారు. చదువుకునే పిల్లలు ఇలా ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకోవడం జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘర్షణను ఆపేందుకు సెక్యూరిటీ సిబ్బంది, మరికొందరు విద్యార్థులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. హాస్టల్ గదుల కేటాయింపుపై సీనియర్లు, జూనియర్ల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు తన్నుకునే వరకు వచ్చినట్టు తెలుస్తోంది.
విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
గుంటూరులోని ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు పొక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థుల బాహా బాహీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఘర్షణకు దిగిన విద్యార్థులను పిలిపించి అసలు ఏం జరిగిందో ఆరా తీశారు. దీనిపై విచారించి విద్యార్థులకు కౌన్సెలింగ్ చేసినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్ దృష్ణ్యా పోలీసులు కేసు నమోదు చేయలేదని వర్సిటీ అధికారులు అంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని, విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చి పంపించారని తెలుస్తోంది.