జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన నాన్-ఇన్వాసివ్, సైంటిఫిక్ సర్వే మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదును హిందూ దేవాలయాన్ని కూలదోసి కట్టిందా? లేదా? నిర్ధారించడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఐదోరోజు తహ్ఖానా(పునాదులు) సర్వేను నిర్వహించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా చేయడం ఎలాంటి తవ్వకాలు లేకుండా సర్వేచేయాలన్న అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తహ్ఖానా సర్వే అంశంపై హిందువల తరపు న్యాయవాది సుధీర్ త్రిపాఠి స్పందించారు. గోపురం సర్వే ఇంకా పూర్తి కాలేదన్నారు. 'తహ్ఖానా'ను కూడా సర్వే చేస్తారని చెప్పారు. శిథిలాలను తొలగించకుండా సర్వే చేయడం వీలు కాదని త్రిపాఠి పేర్కొన్నారు.