Telangana: మండే ఎండల్లో వడగండ్ల వాన.. తెలంగాణలో రైతులకు భారీ నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వడగండ్ల వాన, ఈదురు గాలులు అన్నదాతల కష్టాన్ని నేలమట్టం చేశాయి. మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో విస్తారంగా పంటలు దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఏటుగా పెరిగిన పంటలు ఒక్కసారిగా కురిసిన వర్షం, ఈదురు గాలుల దెబ్బకు కూలిపోయాయి. చెట్లపై ఒక్క మామిడి కూడా మిగలకుండా నేలకూలిపోయింది. జొన్నచేను పూర్తిగా వాలిపోయి, మొక్క కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
Details
ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర నష్టం
సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. భారీ వర్షాల ధాటికి జొన్నచేన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మామిడి, టమాటా సహా వివిధ పంటలు నష్టపోయాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారి, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగిపోయాయి.
Details
కామారెడ్డిలో వాన విరుచుకుపాటు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తీవ్రంగా కురిసింది. గాంధారి, జుక్కల్ మండలాల్లో గాలివానకు జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు నాశనమయ్యాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందాల్సిన పంట పూర్తిగా నష్టపోవడంతో కనీసం పెట్టుబడైనా తిరిగి వచ్చే పరిస్థితి లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Details
హైదరాబాద్‌లోనూ వాన బీభత్సం
పంట నష్టం ఒకవైపు ఉంటే, మరోవైపు ఉరుములు, పిడుగులు భయాందోళనలు కలిగించాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో గాలివాన తీవ్రంగా వీచి అర్ధరాత్రి వరకు వర్షం కురిసింది. పిడుగు పడటంతో ఒక చెట్టు కూలిపోగా, విద్యుత్ సరఫరా నిలిచిపోయి తాండూరు చీకట్లో మగ్గింది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా అర్థరాత్రి భారీ వర్షం కురిసి బీభత్సం సృష్టించింది. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా అకాల వర్షాలు రైతుల ఆశలను ముంచెత్తగా, రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం తీవ్రంగా నమోదవుతోంది.