LOADING...
Rain Alert : తెలంగాణలో వడగండ్ల వానల హెచ్చరిక.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్
తెలంగాణలో వడగండ్ల వానల హెచ్చరిక.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Rain Alert : తెలంగాణలో వడగండ్ల వానల హెచ్చరిక.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే 41 డిగ్రీల మార్క్ దాటింది. శనివారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 14జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అక్కడ 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు ఉక్కపోత కూడా పెరిగింది. అయితే వర్షాల అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఐఎండీ అంచనా ప్రకారం తొలి రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ తరువాత రెండు రోజుల్లో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, వడగండ్ల వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో కూడా ఒకవైపు ఎండలు ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వివరాలు

కోత దశలో రబీ పంటలు

వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులను కల్లాల్లో ఆరబోశారు. ఈ పరిస్థితుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిస్తే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని ప్రభుత్వం వద్ద డిమాండ్ చేస్తున్నారు.

Advertisement