Loading...
National Handloom Award 2025: ఆరు గజాల చీరలో ప్రకృతి అందాలు.. జాతీయ చేనేత అవార్డుకు గంజి వెంకటేశ్
ఆరు గజాల చీరలో ప్రకృతి అందాలు.. జాతీయ చేనేత అవార్డుకు గంజి వెంకటేశ్

National Handloom Award 2025: ఆరు గజాల చీరలో ప్రకృతి అందాలు.. జాతీయ చేనేత అవార్డుకు గంజి వెంకటేశ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రకృతి అందాలను,అందులోని విభిన్న జీవజాలాన్ని ఆరు గజాల పట్టు చీరపై అద్భుతంగా ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్‌ (55) జాతీయ చేనేత పురస్కారం-2025కు ఎంపికయ్యారు. ఆగస్టు 7న దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కార్యాలయం నుంచి వెంకటేశ్‌కు అధికారిక ఆహ్వానం అందింది. పదో తరగతి వరకు చదివిన వెంకటేశ్‌ తన తండ్రి భిక్షపతి వద్ద చేనేత నైపుణ్యాలను నేర్చుకున్నారు. గత 34ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతూ సంప్రదాయ కళకు కొత్త రూపు తీసుకొస్తున్నారు.

vivaralu

15 నెలల నిరంతర శ్రమ

ఈ క్రమంలో 15 నెలలపాటు నిరంతర శ్రమతో 'ఇక్కత్‌' డిజైన్‌లో ప్రత్యేకమైన ఆరు గజాల పట్టు చీరను రూపొందించినట్లు తెలిపారు.

ఈ చీరలో ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఇళ్లు, గుర్రాలు, బాతులు, కుందేళ్లు, నీటి గుర్రం, చేపలు, పడవ, సీతాకోక చిలుకలు, పక్షులు వంటి అనేక అంశాలను అందంగా నేశారు.

ప్రతి రూపానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రకృతి సోయగాలను చీరపై సజీవంగా ప్రతిఫలించేలా రూపకల్పన చేశారు.

ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ... వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన 'ఇక్కత్‌' పద్ధతిలో ఈ చీరను పూర్తిగా చేతితో మగ్గంపై నేయాలని ముందుగానే నిర్ణయించుకున్నానని చెప్పారు.

ముందుగా ఆరు నెలలపాటు శ్రమించి గ్రాఫ్‌ పేపర్‌పై చీర డిజైన్‌ను సిద్ధం చేశానని వివరించారు.

వివరాలు 

ప్రకృతిలో లభించే పదార్థాలతోనే రంగులు

చీర తయారీలో ఎలాంటి రసాయన రంగులను ఉపయోగించకుండా పూర్తిగా ప్రకృతిలో లభించే పదార్థాలతోనే రంగులు తయారు చేసినట్లు తెలిపారు.

టీ పొడి, కొత్తిమీర, పుదీనా, కాచు, మంజిష్ఠ తదితర సహజ పదార్థాలతో రంగులు సిద్ధం చేశామని చెప్పారు.

అనంతరం గ్రాఫ్‌కు అనుగుణంగా టై అండ్ డై విధానంలో మల్బరీ పట్టుదారంలోని 300 కొయ్యల చిటికీకి రంగులు అద్దేందుకు మరో ఎనిమిది నెలలు పట్టిందన్నారు.

చివరగా నెల రోజులపాటు మగ్గంపై ఒక్కో పోగును జాగ్రత్తగా అల్లుతూ ప్రకృతి దృశ్యాలను పట్టు చీరపై ఆవిష్కరించినట్లు వెంకటేశ్‌ వివరించారు.

ADVERTISEMENT