Handloom marks: తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్క్
తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసే చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్‌షీట్లు,ఇతర వస్త్రాలకు ప్రస్తుతం హ్యాండ్లూమ్ మార్క్‌లను ఆవిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్క్ చేనేత వస్త్రాల పరిమాణం, తయారీదారు, వాటి స్వచ్ఛత గురించి సమాచారం అందించే ముద్రగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తయారీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతోపాటు చేనేత కార్మికుల విశిష్టతను గుర్తించవచ్చు.
ఉత్పత్తి చేసే వస్త్రాలను టెస్కో ద్వారా విక్రయం
తెలంగాణ ప్రభుత్వం, చేనేత వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్క్ ట్యాగ్‌లను ప్యాకేజింగ్‌లో జోడించేందుకు ఆర్థిక సాయం కూడా అందించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,425 మంది చేనేత కార్మికులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది 299 చేనేత సహకార సంఘాల కింద పని చేస్తున్నారు. ఈ కార్మికులు ఉత్పత్తి చేసే వస్త్రాలను టెస్కో (రాష్ట్ర చేనేత సహకార సంఘం) ద్వారా విక్రయిస్తున్నారు. సహకార సంఘాల పరిధిలో లేని కార్మికులు తమ వస్త్రాలను వ్యాపారులకు లేదా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తారు.
కార్మికులకు మంచి ఉపాధి అవకాశాలు
చేనేత రిజర్వేషన్ పరిరక్షణ చట్టం కింద 11 రకాల చేనేత వస్త్రాలు ఉన్నాయి, వాటిని మాత్రం చాలా పవర్‌లూమ్ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఈ పరిస్థితి కారణంగా నకిలీల సమస్య పెరిగింది, దీనితో చేనేత వస్త్రాల విక్రయాలు తగ్గాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ చేనేత శాఖ చేనేత వస్త్రాలను పరిరక్షించడానికి, నకిలీల నుంచి రక్షించడానికి, అవి మరింతగా విక్రయమయ్యేలా, చేనేత కార్మికులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా హ్యాండ్లూమ్ మార్క్ పథకాన్ని రూపొందించింది.