Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.
ఈ సందర్భంగా బుధవారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో త్రివేణీ సంగమ ఘాట్లు భక్తుల నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
'హర హర మహాదేవ్' నినాదాలతో కుంభమేళా ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.
64 కోట్ల మంది భక్తుల హాజరు
ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు విచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మహోత్సవంలో నేడు చివరి అమృత్ స్నానం జరగనుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రతా చర్యలను మరింత పెంచారు.
Details
భక్తులు భద్రతా నియమాలు పాటించాలి
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
భక్తులు భద్రతా నియమాలు పాటించి, అధికారులతో సహకరించాలని ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
ఈ ఏర్పాట్లను గోరఖ్‌నాథ్ కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కుంభమేళాలో నో వెహికల్ జోన్
కొన్నిరోజుల క్రితం మౌని అమావాస్య, వసంత పంచమి వంటి ముఖ్యమైన పర్వదినాల్లో భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో ప్రయాగ్‌రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కి.మీ. వరకు వాహనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
కుంభమేళా ప్రాంగణాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలు చేశారు. నిత్యావసర సరుకులు తీసుకొచ్చే వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
Details
భక్తుల రవాణా కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు
కుంభమేళా ముగిసిన అనంతరం భక్తులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలో బుధవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాగ్‌రాజ్ నుంచి 350 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఈ విధంగా మహాకుంభమేళా విజయవంతంగా ముగియనుండగా, భక్తుల భద్రత, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు సమర్థంగా చర్యలు తీసుకుంటున్నారు.