
Haryana DGP: హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య: లీవ్‌పై వెళ్లిన హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలో ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను ప్రస్తుతానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు లీవ్‌పై పంపించారు. ఆత్మహత్య కేసులో నమోదైన ఎఫ్ఐఆర్‌లో కపూర్ కూడా పేరు ఉన్నట్లు వెల్లడైంది. అలాగే, రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను కూడా పదవీ మార్పు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కపూర్‌ను లీవ్‌పై పంపిన విషయం సీఎం మీడియా సలహాదారుడు రాజీవ్ జైట్లీ వెల్లడించారు.
వివరాలు
ప్రధాని మోదీ ర్యాలీ రద్దు
పూరణ్ కుమార్ తన ఆత్మహత్య నోట్‌లో పలు అధికారులు పేర్లను ప్రస్తావించారు. వాటిలో కపూర్, బిజార్నియా తో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, దళితులపై దాడులు జరుగుతున్నట్లు విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో , హర్యానాలోని బీజేపీ సర్కారు డీజీపీ స్థానంలో మార్పు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూరణ్ ఆత్మహత్య వివాదం నేపథ్యంలో, అక్టోబర్ 17న సోనిపట్‌లో జరగాల్సిన ప్రధాని మోదీ ర్యాలీని రద్దు చేశారు. పూరణ్ కుమార్ పోస్టుమార్టం ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యమే ర్యాలీపై ప్రభావం చూపిందని తెలుస్తోంది.
వివరాలు
2023 ఆగస్టు 16న హర్యానా డీజీపీగా శత్రుజీత్ కపూర్ బాధ్యతలు
శత్రుజీత్ కపూర్ 2023 ఆగస్టు 16న హర్యానా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్ల పదవీ కాలపరిమితి ముగిసింది. అయితే కపూర్ స్థానంలో కొత్త డీజీపీ నియామకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి సీనియార్టీ వరుసలో 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మొహమ్మద్ అఖిల్ ముందున్నారు.