#NewsBytesExplainer: 'మాటలు పూర్తయ్యాయి… ఇప్పుడు చర్యలు': వివాదాస్పద ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు యాక్షన్ మోడ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు తప్పనిసరి అని, ఇకపై వ్యవహార శైలిని పూర్తిగా సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు టిడిపి శాసనసభ్యులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొందరికి సాధారణంగా సూచనలు చేస్తే... మరికొందర్ని ప్రత్యేకంగా పిలిపించి తీవ్రంగా మందలించిన సందర్భాలూ ఉన్నాయి. "మీరు మారకపోతే... నేను మారిపోవాల్సి వస్తుంది" అని కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయినా, కొంతమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించడంలేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వివరాలు
కొన్ని నియోజకవర్గాల్లో పవర్ కట్ ప్రక్రియ ప్రారంభం
"ఆ.. ఏముందిలే.. ఆయన అలాగే చెబుతుంటారు.. మనం మన పని చేసుకుంటూ పోవాలి" అనే ధోరణిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు వరుసగా షాకులు షాకులివ్వడం మొదలైపోయిందని టిడిపి నాయకులు చెప్పుకుంటున్నారు. నేను 95 సీఎంని అవుతానంటూ పదేపదే చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు నిజంగానే ఆ దిశగా కఠిన చర్యల్లోకి దిగారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు హెచ్చరికలతోనే సరిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పవర్ కట్ ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. మాట వినని ఎమ్మెల్యేలకు పెద్దగా సమాచారం ఇవ్వకుండానే కమిటీల నియామకాలు జరిగిపోతున్నాయని, ఎవరి జోక్యం లేకుండా మండల టిడిపి కమిటీలను నేరుగా పార్టీ నేతృత్వం ప్రకటిస్తోందని చెబుతున్నారు.
వివరాలు
దారికి రానివారి విషయంలో చర్యలు ఇంకొంచెం ఎక్కువగానే..
దీంతో సంబంధిత ఎమ్మెల్యేల ప్రాభవం సహజంగానే తగ్గిపోతోందట. అలాగే, అక్కడి శాసన సభ్యుడిని నామమాత్రంగా ఉంచేలా చర్యలు నిశ్శబ్దంగా జరుగుతున్నాయని కూడా సమాచారం. నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ చెప్పిన మాట చెల్లుబాటు అయ్యేలా చూస్తే మాట వినని వాళ్ళని ఉత్స విగ్రహాల్లాగే మిగల్చబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఒక వివాదాస్పద నియోజకవర్గం ఎమ్మెల్యేకు పార్టీ వ్యవస్థ నుంచి దూరం పెరుగుతోందని చర్చలు వినిపిస్తున్నాయి. కమిటీ నియామకాల్లో ఆయన అభిప్రాయాన్ని పక్కనపెట్టడం, వేరే ఇన్‌ఛార్జ్‌ను ప్రవేశపెట్టడం, అధికార వర్గాలకు కూడా ఆయన సూచనలు వినాల్సిన పనిలేదని చెప్పేలా అంతర్గత ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఇన్ని చర్యలు తీసుకున్నా.... దారికి రానివారి విషయంలో చర్యలు ఇంకొంచెం ఎక్కువగానే ఉండవచ్చన్నది టీడీపీ వర్గాల టాక్.
వివరాలు
నివేదికల ఆధారంగా మాత్రమే చర్యలు
ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై రోజు వారీ నివేదికలు సిద్ధమవుతున్నాయి. దీనికోసం ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటయ్యింది. మరోవైపు, ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తోంది. ఎవరు అవినీతి వ్యవహారాల్లో మునిగిపోయారో, ఎవరు మాఫియాల్లా వ్యవహరిస్తున్నారో అన్న వివరాలన్నీ పార్టీ పెద్దల దగ్గరకు చేరుతున్నట్టు సమాచారం. మాటల దశ ముగిసిందని, ఇప్పుడు నివేదికల ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా అత్యంత తీవ్రమైన అక్రమాలలో నిమగ్నమై ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటే... మిగతా వాళ్ళు ఆటోమేటిక్‌గా సెట్ అవుతారని,భావన పార్టీలో వినిపిస్తోంది. అలా అవ్వని వాళ్ళను ఉపేక్షించకుండా మరింత కఠిన చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు.
వివరాలు
ప్రక్షాళన దిశగా అడుగులు
ప్రస్తుతం దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వివిధ అక్రమాలు,దందాలలో లోతుగా ఉన్నారన్న రిపోర్టులు రావడంతో వారిని 'రెడ్ జోన్'లో పెట్టారని సమాచారం. ఈ నేపథ్యంలో, లీకుల రూపంలో బయటకు వస్తున్న హెచ్చరికలు, పార్టీలో జరుగుతున్న చర్చలు చూసి ఆయా ఎమ్మెల్యేలు మారతారా? లేక అలాగే కొనసాగుతారా? అనేది ఇప్పుడు పరిశీలనలో ఉంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిపై మాత్రం యాక్షన్ ఆగవచ్చని, లైట్‌గా తీసుకున్న వాళ్లకు మాత్రం తదుపరి దశలో మరింత గట్టి చర్యలు తప్పవని అంటున్నారు. ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనను అంగీకరించడంలో ఇలాగే కొనసాగితే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిని... ప్రభుత్వంపై కూడా ప్రభావం పడుతుందని గ్రహించిన సీఎం, ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారన్న మాటలు ఇప్పుడు టిడిపి వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.