CM Vijay - Sangeetha: విజయ్-సంగీత మళ్లీ ఒక్కటయ్యారా? కోర్టు కేసు మధ్యలోనే కొత్త ట్విస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి సంబంధానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మనస్పర్థల కారణంగా దూరమైన ఈ జంట తిరిగి కలిసిపోయిందని ప్రచారం జరుగుతోంది. సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండగానే, కుటుంబ సభ్యుల జోక్యంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు సద్దుమణిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు విజయ్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.
వివరాలు
త్రిషతో ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్
గత కొన్నేళ్లుగా విజయ్, సంగీత విడివిడిగా జీవిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నటితో విజయ్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే తన 26 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని సంగీత నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రచారం జరిగింది. తన పిటిషన్‌లో 2021 నుంచి విజయ్ ఓ సహనటితో సంబంధం కొనసాగిస్తున్నారని, ఆ బంధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని సంగీత ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.
వివరాలు
అధికారిక ప్రకటన వెలువడలేదు
ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి గానీ, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో గానీ సంగీత, వారి పిల్లలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇద్దరూ విడిపోవడం ఖాయమనే ప్రచారం మరింత బలపడింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇద్దరితో మాట్లాడి సమస్యలను పరిష్కరించినట్లు సమాచారం. గతంలో విజయ్‌కు ఆయన తండ్రితో ఏర్పడిన విభేదాలను కూడా శోభా చంద్రశేఖర్‌నే పరిష్కరించిన సంగతి తెలిసిందే. తాజా ప్రచారం ప్రకారం, తల్లి జోక్యంతో సంగీత లండన్ నుంచి చెన్నైకి చేరుకున్నారని, ప్రస్తుతం విజయ్-సంగీత కలిసి సమయం గడుపుతున్నారని చెబుతున్నారు.