LOADING...
Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఆలస్యం.. సుప్రీంకోర్టులో స్పీకర్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఆలస్యం.. సుప్రీంకోర్టులో స్పీకర్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు

Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఆలస్యం.. సుప్రీంకోర్టులో స్పీకర్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై 'కోర్టు ధిక్కార పిటిషన్'‌ను బీఆర్ఎస్ (BRS) దాఖలు చేసింది. ఫిరాయింపు కేసులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదన్న కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు, పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ముందుకు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇంకా తమ పదవుల్లోనే కొనసాగుతున్నారని వాదించారు.

Details

మరింత గడువు అవసరం

ఈ కేసు విచారణ ఆలస్యం కావడం రాజ్యాంగ విరుద్ధమని, గతంలో ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు తక్షణ నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నదని న్యాయవాదులు గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రొసీడింగ్స్ ఇంకా 'ఎవిడెన్స్ స్టేజ్'లోనే ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి, కేసును వచ్చే సోమవారం విచారణకు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలాఉంటే, ఇదే కేసులో స్పీకర్ కార్యాలయం కూడా ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయడానికి మరింత గడువు అవసరమన్నారు.

Details

మరో రెండు నెలల సమయం కావాలి

ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు ముగిసిపోయిందని, కనీసం మరో రెండు నెలల సమయం ఇవ్వాలని కోరింది. ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయ్యిందని, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల కారణంగా నిర్ణయం ఆలస్యం అయిందని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం తెలిపింది. మొత్తం మీద, ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వచ్చే సోమవారం ఇవ్వబోయే తీర్పుపై రాజకీయ వర్గాలన్నీ కన్నేసి ఉన్నాయి.