Heat Waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత.. నాతవరంలో 42.1 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రత
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలను మించి నమోదైంది.
ఉదయం 8 గంటల తరువాత బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.
అనకాపల్లి జిల్లా నాతవరంలో ఆదివారం అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే, నంద్యాల జిల్లా రుద్రవరం, విజయనగరం జిల్లా పెదనందిపల్లిలో 41.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.4 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట, అప్పయ్యపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మొత్తం 14 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి, అలాగే 56 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదయ్యాయి.
వివరాలు
నేడు 202 మండలాల్లో వడగాలులు
సోమవారం రాష్ట్రంలోని 202 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
విజయనగరం జిల్లాలో 15 మండలాలు, పార్వతీపురం మన్యంలో 12, శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
అదే విధంగా, పల్నాడు జిల్లాలో 19 మండలాలు, తూర్పుగోదావరిలో 19, అనకాపల్లిలో 16, శ్రీకాకుళంలో 16, కాకినాడలో 15, గుంటూరులో 14, ఏలూరులో 13, కృష్ణాలో 10, విజయనగరంలో 10, అల్లూరి సీతారామరాజులో 9, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమలో 9, ఎన్టీఆర్ జిల్లాలో 8, పార్వతీపురం మన్యంలో 3, పశ్చిమగోదావరిలో 3, విశాఖపట్నంలో 2, బాపట్లలో 1 మండలంలో వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు.