Heatwave 2026: హీట్‌వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ.. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటగా.. మరికొన్ని ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాలపై తీవ్ర వడగాలుల ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న ఎండల తీవ్రత ఢిల్లీలోని రిడ్జ్, ముంగేశ్‌పూర్ ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలుగా నిలిచాయి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ఢిల్లీ ఎందుకు ఇంత వేడెక్కుతోంది?
వాతావరణ నిపుణుల ప్రకారం థార్ ఎడారి, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తున్న వేడి, పొడి గాలుల కారణంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. తేమ శాతం తక్కువగా ఉండటం, ఆకాశం మేఘాలు లేకుండా స్పష్టంగా ఉండటం వల్ల వేడి మరింత ఎక్కువగా నిలిచిపోతోంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం పరిస్థితిని మరింత కఠినంగా మారుస్తోంది. వడగాలులు ఎందుకు ప్రమాదకరం? 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే శరీరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. డీహైడ్రేషన్,అలసట,హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు రావచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఎయిర్ కండిషనర్లు, కూలింగ్ పరికరాల వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది.
వివరాలు
ఉపశమనం కలిగించే అవకాశం ఉందా?
ఈ వారం చివర్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, దుమ్ము తుఫాన్లు, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే అవకాశమున్నా.. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కావచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లో పెరుగుతున్న వడగాలుల తీవ్రతకు వాతావరణ మార్పులు, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంక్రీట్ భవనాలు, వాహనాల కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం కారణంగా నగరాల్లో వేడి ఎక్కువసేపు నిలిచిపోతోందని వివరించారు. దీనినే "అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్"గా పిలుస్తున్నారు.
వివరాలు
రుతుపవనాల కోసం ఎదురుచూపులు
నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలో పూర్తిగా ప్రవేశించడానికి ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, నేరుగా ఎండలో తిరగకుండా ఉండడం, మధ్యాహ్న వేళల్లో బయట కార్యకలాపాలు తగ్గించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.