Heatwave: రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. ఎండల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నమోదైంది.
వివరాలు
వడదెబ్బతో ఇద్దరు మృతి
అక్కడ 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవడం ఎండల తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారానికి చెందిన గీత కార్మికుడు దార్ల కృష్ణ (50) వడదెబ్బతో మృతి చెందాడు. అలాగే కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కౌలు రైతు కూనపరెడ్డి రామకృష్ణ (53) పొలంలో పని చేస్తున్న సమయంలో వడదెబ్బకు గురై మృతిచెందినట్లు స్థానిక రైతులు తెలిపారు.
వివరాలు
300 మండలాల్లో వడగాలులు!
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 74 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 232 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. విజయనగరం, మార్కాపురం ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
300 మండలాల్లో వడగాలులు!
శ్రీకాకుళం, విశాఖపట్నం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శుక్ర, శనివారాల్లో కూడా ఎండల తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముందని హెచ్చరించారు.
వివరాలు
అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. బుధవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
వివరాలు
325 వడదెబ్బ అనుమానిత కేసులు
రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల ఎండల పరిస్థితిపై ముందస్తు అంచనాలు తీసుకుని జిల్లాల వారీగా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి మే 19 వరకు 325 వడదెబ్బ అనుమానిత కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1.44 కోట్ల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.