Heatwave: ఏపీలో భానుడి భగభగ.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు,కొన్ని జిల్లాల్లో వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వడగాలులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల అంచనాల ప్రకారం గురువారం రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. అలాగే శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
వివరాలు
బాపట్ల జిల్లాలో 44 డిగ్రీలు
బుధవారం నమోదైన ఉష్ణోగ్రతల్లో మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.3 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 43.2 డిగ్రీలు నమోదయ్యాయి. అదే విధంగా గుంటూరు జిల్లా రాయపూడిలో 43 డిగ్రీలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 42.7 డిగ్రీలు, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 42.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా రాజాంలో 42.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా కలపర్రులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
మరోవైపు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వడగాలుల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.