Loading...
Heavy Flood: వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అప్రమత్తత
వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అప్రమత్తత

Heavy Flood: వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అప్రమత్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,432 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మొత్తం 80.50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో గురువారం సాయంత్రానికి 21.20 టీఎంసీల మేర నీరు నిల్వైంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్టేజ్-1 పరిధిలో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్-2లో 4.80 లక్షల ఎకరాలతో కలిపి మొత్తం 14.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.

వివరాలు 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

ఎస్సారెస్పీకి దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

కడెం నుంచి వస్తున్న వరదతో పాటు స్థానిక వర్షాల ప్రభావంతో గురువారం రాత్రికి ఎల్లంపల్లి వద్ద 4.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

ఇదే స్థాయిలో నీటిని మేడిగడ్డ వైపు విడుదల చేస్తున్నారు.

వివరాలు 

నంది రిజర్వాయర్‌లోకి 15,750క్యూసెక్కుల నీరు

20.18 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 19.70 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయానికి గురువారం ప్రారంభమైన ఎత్తిపోతల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది.

బుధవారం నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో నాలుగు మోటార్లు చొప్పున నడిపి 12,600 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోసిన అధికారులు,గురువారం నంది పంప్‌హౌస్‌లో మరో మోటారును ప్రారంభించారు.

దీంతో నంది రిజర్వాయర్‌లోకి 15,750క్యూసెక్కుల నీరు చేరుతోంది.

నంది రిజర్వాయర్‌కు చేరుతున్న ఇదే పరిమాణంలో నీటిని సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు.

అక్కడ ఐదు మోటార్ల సహాయంతో వరద నీటిని ఎత్తిపోస్తుండగా,వరద కాలువ ద్వారా 15,750 క్యూసెక్కుల ప్రవాహం మధ్య మానేరు జలాశయంలోకి చేరుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరిలోకి 9.36 లక్షల క్యూసెక్కులు 

ప్రాణహిత నదిలోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి ప్రస్తుతం 3.31 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంద్రావతి నది ద్వారా వస్తున్న వరద, స్థానిక ప్రవాహాలు కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరిలోకి 9.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తీసుకువస్తున్నాయి.

ములుగు జిల్లాలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని టేకులగూడెం సమీప రేగుమాకుగండి వద్ద వరద నీరు రహదారిపైకి చేరడంతో హైదరాబాద్-భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ADVERTISEMENT

వివరాలు 

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోనూ వరద ప్రవాహం

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా ఉద్ధృతమవుతోంది.

గురువారం రాత్రి 8 గంటల నాటికి నీటిమట్టం 28.70 అడుగులకు చేరుకోగా,3.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

ప్రాణహిత,ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరద తీవ్రతను పరిశీలిస్తే భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది.

కర్ణాటకలోని ఎగువ కృష్ణా ప్రాజెక్టు ఆలమట్టికి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్ ప్రాజెక్టుకు 95 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా, అక్కడి నుంచి 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

వివరాలు 

శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

తెలంగాణలో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాలకు గురువారం రాత్రి 1.04 లక్షల క్యూసెక్కుల వరద చేరగా, 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

215.81 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో గురువారం సాయంత్రానికి 46.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తొలి దశ పంప్‌హౌస్ నుంచి ఎల్లూరు జలాశయానికి 1,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

అలాగే జూరాల వెనుక జలాలపై ఆధారపడి పనిచేసే ఇతర ఎత్తిపోతల పథకాలలో కూడా నీటి ఎత్తిపోతలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT