LOADING...
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ జారీ

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయని హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 5 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో 15, 16, 17 తేదీల్లో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వివరాలు

పలు ప్రాంతాలకు విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ప్రవేశించాయి. అనంతరం అవి కొద్దిగా ముందుకు కదిలి 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు విస్తరించాయి. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను రుతుపవనాలు ఇంకా పూర్తిగా తాకలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో గరిష్ఠంగా 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో 40డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement