
Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షంతో మునిగిన జనావాసాలు,రహదారులు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది.మధ్యాహ్నం మొదలైన వర్షం సాయంత్రం వరకు కురిసి ఆగిపోయింది. అయితే, సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరిన సమయానికే మేఘాలు మళ్లీ గర్జించాయి. అమీర్‌పేట,ఎల్లారెడ్డిగూడ,యూసుఫ్‌గూడ,శ్రీకృష్ణానగర్ ప్రాంతాల్లో వరద నీటిలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ రెండు బస్తీలలో సుమారు 200 ఇళ్లలోకి నీరు చేరినట్లు,అలాగే ఐదు వందలకు పైగా ద్విచక్ర వాహనాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. కూడళ్లలో నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ,హైడ్రా బృందాలు మోటార్ల సహాయంతో నీటిని దారి మళ్లించే చర్యలు చేపట్టాయి. బంజారాహిల్స్‌లో మేయర్ విజయలక్ష్మి ప్రత్యక్షంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు.
వివరాలు
కిక్కిరిసిన మెట్రో
మెట్రో రైళ్లు గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అసాధారణ రద్దీని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా అమీర్‌పేట, రాయదుర్గం స్టేషన్ల ఫ్లాట్‌ఫార్ములపై నిలబడటానికే స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రోజుకు సగటున 4.5 లక్షల ప్రయాణికులు మెట్రోను ఉపయోగిస్తారు. అయితే, సోమవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురవడంతో ఆ రోజు 5.30 లక్షల మంది ప్రయాణించిన రికార్డు నమోదైంది.
వివరాలు
సెలవుల రద్దు
నగరంలో వర్ష పరిస్థితులు మరింత తీవ్రం కావచ్చన్న అంచనాతో రానున్న మూడు రోజులు జలమండలిలోని అన్ని స్థాయి అధికారులు 24 గంటలూ సిద్దంగా ఉండాలని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచే అన్ని ఎయిర్‌టెక్ మెషీన్లు, సిల్ట్ కార్ట్ వాహనాలు సిద్దంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా, విద్యుత్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ శాఖలకు చెందిన అధికారుల సెలవులు కూడా రద్దు చేస్తున్నట్లు మూడు జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
వివరాలు
మంత్రుల సమీక్ష
గ్రేటర్ పరిధిలో కురుస్తున్నభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్,దుద్దిళ్ల శ్రీధర్ బాబు వేర్వేరుగా ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ,హైడ్రా,పోలీస్ బృందాలు నీటినిల్వ ఉన్న ప్రాంతాల్లో వేగంగా స్పందించాలని మంత్రి పొన్నం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు,మున్సిపల్ కమిషనర్లు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. అలాగే, రాబోయే రెండు రోజులు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని, వర్షం తీవ్రంగా పడే పరిస్థితికి అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో కూడా శ్రీధర్ బాబు ఈ విషయంపై చర్చించారు.