దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు
దిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్‌లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇది 13డిగ్రీలు తక్కువని వెల్లడించింది. దీంతో గత 13ఏళ్లలో దిల్లీలో మే నెలలో అతి చల్లని రెండో రోజుగా సోమవారం(మే 1వ తేదీ) నిలిచినట్లు ఐఎండీ పేర్కొంది. అంతకుముందు 2021 మే 19న టౌక్టే తుఫాను ప్రభావం కారణంగా దిల్లీలో 23.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది మొదటి కూలెస్ట్ డేగా రికార్డుల్లోకి ఎక్కింది.
దిల్లీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
గతేడాది మే 1వ తేదీన 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది 26.1 డిగ్రీలు మాత్రమే రికార్డు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దేశ రాజధానిలో వచ్చే రెండు, మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే, మంగళవారం గాలులతో పాటు తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షంతో పాటు సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.