Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 'రెడ్ అలర్ట్' ప్రకటించిన వాతావరణ శాఖ
గుజరాత్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది. వడోదర సహా పలు జిల్లాలు నీటిమయం కావడంతో వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవ్ సారి జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరదలు విస్తృతంగా పొటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర రీజియన్ పరిధిలో భారత వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు గాలింపు
వల్సాడ్, తాపి, నవ్ సారి, సూరత్, నర్మద, పంచ్ మహాల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం దెబ్బతింది. మోర్బీ జిల్లాలో నదిపై నిర్మించిన కాజ్ వే వరద నీటిలో మునగడంతో, ఆ మార్గంలో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో అదృశ్యమైన ఏడుగురు వ్యక్తుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. నవ్ సారి జిల్లా ఖేర్ గామ్ తాలూకా పరిధిలో అత్యధికంగా 356 మిల్లీమీటర్ల వర్షపాతం, వడోదరలోని పద్రా ప్రాంతంలో 270 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అప్రమత్తంగా ఉండాలి
నర్మద, సౌరాష్ట్ర, రాజ్ కోట్, తాపి, మహిసాగర్, మోర్బీ, దాహోద్, వడోదర జిల్లాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురిసింది. శ్రావణ మాసంలో పండుగల సందర్భంగా ప్రజలు భారీగా గుమికూడే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సౌత్ గుజరాత్ పరిధిలోని జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే 105 శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. సౌరాష్ట్ర పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే 100 శాతం ఎక్కువ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.