భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు
భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలోని నాగ్ పూర్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. భారీ వర్షాలు పడుతుండటంతో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నాగ్ పూర్ లో 106మిల్లీ మీటర్ల వర్షాపాతం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడి చేసింది. విపరీతమైన వానలకు నాగ్ పూర్ సమీపంలోని అంబజారీ సరస్సు పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతలన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే భారత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు.
వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు
వర్షాల వల్ల ఉప్పొంగుతున్న సరస్సుల కారణంగా వరదలు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 25మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించేసారు. మరీ అవసరం అయితే తప్ప జనాలెవరూ ఇండ్లలోంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాగ్ పూర్ ప్రాంతంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అంతేకాదు, గోంఢియా, చంద్రపూర్, వార్ధా, భండారా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట.