ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ముఖ్యంగా దిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉంది. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఐదుగురు చనిపోయారు. దిల్లీలో దాదాపు 41 ఏళ్ల తర్వాత భారీగా వానలు పడినట్లు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. దిల్లీలో ఆదివారం ఉదయం 8:30తో ముగిసిన 24 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1982 తర్వాత జూలైలో ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షాపాతంగా భారత వాతావరణ శాఖ తెలిపింది.
రోడ్లపై మోకాళ్ల లోతులో వర్షపు నీరు
దిల్లీలో మరో రెండు రోజులు వర్షాలు
దిల్లీలో జూలై 10, 2003న 133.4 మి.మీ వర్షం కురిసింది. ఇటీవల కాలంలో ఇదే అత్యధక వర్షాపాతంగా ఉండేది. తాజాగా కురిసిన 153 మిల్లీమీటర్లతో లెక్కమారిపోయింది. అయితే జూలై 21, 1958న కురిసిన 266.2 మి.మీ. వర్షాపాతమే ఇప్పటికీ ఆల్ టైమ్ హై అని చెప్పాలి. దిల్లీలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ పసుపు అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్‌లు, ఆసుపత్రి ప్రాంగణాలు కూడా నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీటిలో వెళ్తున్న పాదాచారులు, వాహనాల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హిమాచల్‌లో వరద ఉద్ధృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సిమ్లాలో ముగ్గురు, చంబాలో ఒకరు మరియు కులులో ఒకరు మరణించారు. రాష్ట్రంలోని బియాస్ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని కాంగ్రా, మండి, సిమ్లాలో మోహరించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. రాష్ట్రంలోని దాదాపు ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ "రెడ్" అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉంది. సిమ్లా, సిర్మౌర్, లాహౌల్, స్పితి, చంబా, సోలన్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో అనేక రహదారులు మూతపడ్డాయి.
జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలు
కశ్మీర్‌లోని చాలాచోట్ల భారీ వర్షాల కారణంగా జీలం నది, దాని ఉపనదులలో నీటి మట్టం కొన్ని గంటలలో వేగంగా పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చారించారు. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల రికార్డు వర్షపాతం నమోదైంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో సహా కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. అలాగే ఆదివారం కూడా వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి, గత 24 గంటల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు.