Page Loader
ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్
ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు 37 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురు భారీ వర్షాల వల్ల తలెత్తిన ప్రమాదాల వల్ల చనిపోయారు. దిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. అలాగే ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి.

ఉత్తర భారతం

39 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

భారీ వర్షాలు, వరదలను పరిష్కరించడానికి మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలను తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే, వర్షాల కారణంగా జమ్ముకశ్మీర్‌లో 7,000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. భగవతినగర్ బేస్ క్యాంపులో 5,000 మందికి పైగా, రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ బేస్ క్యాంపులో మరికొంత మంది చిక్కుకున్నారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసిన నేపథ్యంలో మంగళవారం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిమాచల్‌లో వరద బీభత్సం

హిమాచల్

హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ

వర్షాల తీవ్రత హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. లాహౌల్, స్పితిలోని చందర్తాల్, పాగల్ నల్లాతో పాటు ఇతర ప్రదేశాలలో 300 మందికి పైగా పర్యాటకులు మరియు స్థానికులు చిక్కుకుపోయారు. అయితే వాతావరణం కుదుటపడ్డాక వారిని ప్రత్యేక విమానంలో తరలిస్తామని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు చెప్పారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలోని అనే చోట్ల విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దిల్లీ

దిల్లీలో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా

భారీ వర్షాల కారణంగా దిల్లీలోని యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. దిల్లీలోని భారీ వర్షాలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. యమునా నదిలో వరద పెరుగుదలపై చర్చించారు. దేశ రాజధానిలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వరదల్లో చిక్కుకోవడంతో పంజాబ్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన 910 మంది విద్యార్థులతో పాటు మరో 50 మందిని ఆర్మీ రక్షించింది. వర్షాల కారణంగా పంజాబ్ ప్రభుత్వం జూలై 13 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది.

దిల్లీ

అప్రమత్తంగా ఉండండి: అధికారులకు యూపీ సీఎం ఆదేశం

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివిధ శాఖల సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు. ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారితో పాటు పలు రహదారులు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని యూపీ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. రాజస్థాన్‌లో వర్షాల కారణంగా తూర్పు, మధ్య ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, రైలు పట్టాలు, ఆసుపత్రులను కూడా వరదలు ముంచెత్తాయి.