Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు.. మత్స్యకారులకు హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతోంది. ఐఎండీ ప్రకారం ఈ వాయుగుండం 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నాగపట్నం, చెంగల్‌పట్టు, తిరువావూర్, కడలూరు వంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షపాతం నమోదు అవుతోంది. తమిళనాడులోని కావేరి డెల్టా జిల్లాలు, ముఖ్యంగా నాగపట్నం, మైలదుత్తురై, తిరువావూర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ పరిస్థితుల వల్ల ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు సమీపంలోని ఓడరేవులకు చేరుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు రక్షణ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.