Rains: ఏపీలో మారుతున్న వాతావరణం.. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాలులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ మార్పులు కనిపించే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6 డిగ్రీలు నమోదు కాగా, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వివరాలు
వడదెబ్బ
ఇక వడదెబ్బ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలాసపురానికి చెందిన సింహాచలం పాణిగ్రహి(68), రంగనాథపురానికి చెందిన నడిపూడి కృష్ణారావు(36) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.