
Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రహదారులపై వరద, ట్రాఫిక్ జామ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోబుధవారం సాయంత్రం నుండి రాత్రివరకు భారీ వర్షం విరుచుకుపడింది. ఒక్కసారిగా ఆకాశం బీభత్సంగా మారి, వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్, కాప్రా, ఏఎస్‌రావు నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వరదనీరు ఉధృతంగా ప్రవహించి ఇళ్లలోకి చేరింది.
వివరాలు
తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న వాహనదారులు
యూసుఫ్‌గూడ కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీరు ప్రవహించడంతో వృద్ధులు, చిన్నారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్-హైటెక్ సిటీ కూడలిలో ట్రాఫిక్ స్తంభించగా, రాయదుర్గం, అమీర్‌పేట్, బంజారాహిల్స్ ఐకియా రోడ్లలో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మియాపూర్-చందానగర్ మార్గంలో రహదారిపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోవడంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
వివరాలు
ఇళ్లలోకి వరద నీరు - గోడ కూలిన ఘటనలు
వరద ప్రవాహంతో అనేక ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్‌పేట్‌లోని గాయత్రి నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరగా, సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలిపోయింది. సురేష్ థియేటర్ దగ్గర ఒక ఆటోపై గోడ కూలినా, అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రామ్‌గోపాల్‌పేట్ బస్తీలు, చిల్కలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడ్‌పల్లి అంబేద్కర్ నగర్, మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లలో నీరు చేరింది. ఒలిఫెంటు రైల్వే వంతెన కింద నీరు చేరడంతో సికింద్రాబాద్-తార్నాక, ముషీరాబాద్ వైపు వెళ్లే రోడ్లను పోలీసులు మూసివేశారు.
వివరాలు
ముషీరాబాద్‌లో అత్యధిక వర్షపాతం
నగరంలో అత్యధికంగా ముషీరాబాద్‌లో 18.43 సెం.మీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్‌లో 13 సెం.మీ, శేరిలింగంపల్లి 12.6 సెం.మీ, చందానగర్ 11.2 సెం.మీ, లింగంపల్లి 10.7 సెం.మీ, జూబ్లీహిల్స్ 8.9 సెం.మీ, బేగంపేట్ 8.7 సెం.మీ, ఖైరతాబాద్ 8.5 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అధికారులకు సీఎం ఆదేశాలు నగరంలో పరిస్థితిని సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నీరు నిలిచిన ప్రదేశాల్లో,ట్రాఫిక్ సమస్యలు ఉన్న చోట్ల పోలీస్,ట్రాఫిక్,హైడ్రా విభాగాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నాలాల పక్కన నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, అత్యవసరం తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
వివరాలు
బాపూజీనగర్, వినోబానగర్‌లో వరద ఉద్ధృతి
హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో 040-29560521, 9000113667, 9154170992 నంబర్లకు సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముషీరాబాద్ పరిధిలోని బాపూజీనగర్, వినోబానగర్‌లో వరద నీరు ఉద్ధృతంగా పారుతోంది. భోలక్‌పూర్ పద్మశాలి కాలనీ నుంచి గాంధీనగర్ దారిలో రహదారి పూర్తిగా మునిగిపోయింది. గాంధీనగర్ రోడ్ నం.7లో వరద నీటికి పలు బైకులు కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ వద్ద రహదారిపై నీరు గట్టిగా ప్రవహిస్తోంది. కార్వాన్‌లో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట్ గాయత్రి నగర్ వాసులు ఇళ్లలో నీరు చేరడంతో సహాయం కోరుతున్నారు.
వివరాలు
మేయర్ పర్యటన - సూచనలు
నగరంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసబ్‌ట్యాంక్‌లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ శాఖలను అప్రమత్తం చేశారు. నిలిచిన నీటిని తొలగించటం, రోడ్లను శుభ్రపరచడం వంటి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. రాజ్‌భవన్ సమీపంలో నాలాల్లో పెద్ద డబ్బాలు ఉండటం వల్ల నీరు నిలిచిపోయిందని ఆమె తెలిపారు. నాలాల్లో వ్యర్థాలు, ఫర్నిచర్, పరుపులు వంటివి వేయొద్దని ప్రజలను కోరారు.