
Heavy Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... జూలై 16న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్నిచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అంచనా వేసింది. జూలై 17న తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈ ప్రాంతాల్లో కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.
Details
తెలంగాణ
జూలై 18న రాష్ట్రంలో మళ్లీ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గంటకు 6-8 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు కనిపిస్తున్నాయి.
Details
ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. జూలై 16 బుధవారం మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడొచ్చని అంచనా.