Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. 48 గంటలపాటు అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయానికి ఈ వాయుగుండం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్రత పెంచుకొని పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాత ఈ వాయుగుండం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపుగా ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
వాయుగుండం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
ఏపీలో భారీ వర్షాలు
ఇక ఏపీలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అధికంగా ఉంటుందని తెలిపింది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పింది. సోమవారం ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.