AAP Crisis: హర్భజన్ సింగ్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు కేంద్ర భారీ భద్రత
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ)కి రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారీ షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ ఘటన తర్వాత పంజాబ్‌లో ఆప్ కార్యకర్తలు మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్బజన్ సింగ్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన నివాసంపై దాడి చేయడంతో పాటు 'పంజాబ్ ద్రోహి' అంటూ గోడలపై నల్ల సిరాతో రాశారు. దీంతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం హర్భజన్ సింగ్‌కు ఉన్న భద్రతను తొలగించింది.
వివరాలు
భద్రతను కల్పించిన సీఆర్పీఎఫ్
జలంధర్‌లోని ఆయన నివాసం నుంచి సెక్యూరిటీ సిబ్బంది, ప్రభుత్వ వాహనాలను కూడా వెనక్కి తీసుకుంది. అయితే పరిస్థితి సీరియస్‌గా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు తక్షణమే సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించింది. హోం శాఖ వర్గాల ప్రకారం, హర్భజన్ సింగ్‌తో పాటు ఆప్ నుంచి బీజేపీలో చేరిన ఇతర ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టర్, స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ జీత్ సహానీలకు కూడా కేంద్ర భద్రత ఏర్పాటు చేశారు. ఇకపై వీరందరికీ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా సీఆర్పీఎఫ్ రక్షణ అందనుంది. ఈ మొత్తం పరిణామాలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందిస్తూ, పార్టీని వీడిన ఎంపీలను "ద్రోహులు"గా అభివర్ణించారు.