LOADING...
Iran-Israel Conflict : గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

Iran-Israel Conflict : గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్‌.ఆర్‌.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్రాలకు చెందిన భారత పౌరులు కూడా భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అందరూ సంయమనం పాటించాలని సూచించారు. త్వరలోనే విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.

వివరాలు 

ఎంబసీలో నమోదు తప్పనిసరి

ఇండియన్ ఎంబసీల్లో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఇరాన్,ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం,భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల సరైన,అధికారిక సమాచారం మాత్రమే తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలతో సంప్రదింపులో ఉండాలని సూచించారు. త్వరలోనే విమానయాన సేవలు పునరుద్ధరించబడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పౌరులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతర సంప్రదింపులు జరుపుతోందని మంత్రి వెల్లడించారు.

వివరాలు 

హెల్ప్‌లైన్ నంబర్లు

ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఏపీ ఎన్నార్టీ హెల్ప్‌లైన్ నంబర్లు +91 8500027678, +91 0863 2340678లను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం https://apnrts.ap.gov.in/ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, స్థానిక అధికారులు,అధికారిక మీడియా విడుదల చేసే సమాచారం మాత్రమే అనుసరించాలని రాష్ట్ర పౌరులకు మంత్రి పిలుపునిచ్చారు.

Advertisement