Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఆరోజే!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సునామి విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి మొత్తం 56 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. దీంతో జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ నవంబర్ 26న కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని అనేకమంది ప్రతిపక్ష నాయకులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, వామపక్ష నేత దీపాంకర్ భట్టాచార్య పాల్గొననున్నట్టు సమాచారం.
ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన హేమంత్ సోరెన్
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 స్థానాలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో జేఎంఎం కూటమి 56 స్థానాలు గెలుచుకోవడం ముఖ్యమైంది. జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 గెలుచుకోగా, కాంగ్రెస్ 16 సీట్లు, ఆర్జేడీ నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జార్ఖండ్‌లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీ కేవలం 21 స్థానాల్లో విజయం సాధించి, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రజల ఆశీర్వాదాలతో జేఎంఎం ఘన విజయం సాధించిందని హేమంత్ సోరెన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు.