LOADING...
Kedarnath Helicopter Service : ఇకపై కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రయాణం చాలా ఖరీదూ.. ఛార్జీలపై 5శాతం పెంపు
ఇకపై కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రయాణం చాలా ఖరీదూ.. ఛార్జీలపై 5శాతం పెంపు

Kedarnath Helicopter Service : ఇకపై కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రయాణం చాలా ఖరీదూ.. ఛార్జీలపై 5శాతం పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతేడాది లక్షలాది మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటారు. అయితే ఈసారి కేదార్‌నాథ్ యాత్ర మరింత ఖరీదైనదిగా మారనుంది. హెలికాప్టర్ సర్వీసుల ద్వారా వెళ్లే భక్తులపై అదనపు భారం పడనుంది. హెలికాప్టర్ ఆపరేటింగ్ కంపెనీలు ఛార్జీలను 5 శాతం పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఈ పెంపు నిర్ణయంపై తుది ఆమోదం కోసం ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి మండలి సమావేశం జరగనుంది.

Details

హెలికాప్టర్ ఛార్జీల పెంపు వివరాలు

కేదార్‌నాథ్ దర్శనానికి హెలికాప్టర్‌ను ఉపయోగించే భక్తుల కోసం ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గుప్త్కాషి నుండి వన్-వే ఛార్జీ రూ. 4063గా ఉంది. ఇది పెరిగి రూ. 4266కి చేరుకోనుంది. అలాగే ఫాటా నుండి వన్-వే ఛార్జీ రూ. 2887 ఉండగా, 5 శాతం పెరుగుదలతో రూ. 3031 అవుతుంది. సిర్సి నుండి వన్-వే ఛార్జీ ప్రస్తుతం రూ. 2886గా ఉంది. ఇది పెరిగి రూ. 3030కు చేరుకోనుంది. కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకున్న తర్వాత మే నెలలో యాత్ర ప్రారంభమవుతుందని అంచనా. భక్తుల రద్దీకి అనుగుణంగా పరిపాలనా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 2024లో మొత్తం 15,52,076 మంది భక్తులు కేదార్‌నాథ్‌కు విచ్చేశారు. మొదటి దశలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు.

Details

 అయోధ్యలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం 

ఇక కేదార్‌నాథ్ హెలికాప్టర్ ఛార్జీల పెంపుపై చర్చ కొనసాగుతుండగానే, అయోధ్యలో కొత్తగా హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఇప్పుడు ఆకాశ మార్గంలోనే రామ్‌నగర్ వైభవాన్ని వీక్షించవచ్చు. ఈ 10 నిమిషాల విమాన ప్రయాణానికి 60 గంటల ముందుగా బుకింగ్ అవసరం. ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు 40 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ప్రయాణంలో భక్తులు రామాలయం, హనుమాన్‌గఢి, కనక్ భవన్, దశరథ్ మహల్‌లను వీక్షించవచ్చు. ఈ విమాన సేవల కోసం ఒక్కొక్కరికి రూ. 4130 ఛార్జీ నిర్ణయించారు. మొత్తంగా కేదార్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్ ద్వారా వెళ్లే భక్తులకు ఈసారి ఖర్చులు పెరుగనున్నాయి. అయితే అయోధ్యలో కొత్తగా ప్రారంభమైన హెలికాప్టర్ సేవలు భక్తులకు అదనపు ఆకర్షణగా మారాయి.