
Odisha Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా భువనేశ్వర్‌లో ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఈ దాడులు జరిగే సమయంలో ఆ అధికారి అసహ్యంగా కంగారుపడి ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న నగదు పట్టుబడకూడదని నేరుగా తన ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల కట్టల్ని బయటకు విసిరేశాడు. ఒక్కసారిగా ఈ అనూహ్య ఘటన చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. కరెన్సీ కట్టలు వర్షంలా కింద పడుతుండటంతో వారు విస్తుబోయారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒడిశా రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న బైకుంఠనాథ్ సారంగి. ఆయనపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం అధికారులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
వివరాలు
సోదాల్లో భాగంగా అధికారులు రూ. రెండు కోట్లకు పైగా నగదు
మొత్తం ఏడు ప్రదేశాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. తన ఆస్తుల దారుణ సత్యం బయటపడుతుందన్న భయంతో సారంగి, తన ఫ్లాట్ కిటికీ ద్వారానే డబ్బును బయటకు విసిరేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈ దృశ్యాలన్నీ ప్రత్యక్ష సాక్షుల సమక్షంలోనే చోటు చేసుకోవడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా అధికారులు రూ. రెండు కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు. మొత్తం 26 మంది విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలను లెక్కగట్టుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ దాడులతో ఆయన వద్ద ఉన్న అక్రమ సంపద ఎంత స్థాయిలో ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.