MLAs disqualification issue: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు
తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై షెడ్యూలు ఖరారు చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం రద్దు చేసింది. స్పీకర్ తనకు అనుకూలమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ, 10వ షెడ్యూల్ ప్రకారం పరిష్కారం చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. భారతీయ రాష్ట్ర సమితి(భారాస)తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో,వీరిపై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద్‌లు పిటిషన్లు దాఖలు చేశారు.
హైకోర్టులో సవాలు చేసిన అసెంబ్లీ కార్యదర్శి
ఇదే సమయంలో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఈ కేసును విచారించి,నాలుగు వారాల్లో షెడ్యూలు ఖరారు చేయాలని ఆదేశించారు. అయితే,ఈ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో సవాలు చేశారు.వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శుక్రవారం వెలువరించిన తీర్పులో,ఈ అంశంపై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.