LOADING...
IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు వాయుసేనలో ఫైటర్‌ జెట్ల సంఖ్య తగ్గిపోతుంటే, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) మాత్రం విమానాల ఉత్పత్తిపై నెమ్మదిగా స్పందిస్తోందని తెలుస్తోంది. తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే-1ఏ తయారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల వాయుసేన చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ పలుమార్లు తేజస్‌ విమానాల ఉత్పత్తిపై హాల్‌ పనితీరుపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. వైమానిక దళంలో ఆపరేషనల్‌ స్క్వాడ్రన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

350 తేలికపాటి యుద్ధవిమానాలను ఆపరేట్‌ చేయాలని వాయుసేన లక్ష్యం

ఈ సమస్య పరిష్కారానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. దీని నేతృత్వం రక్షణశాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సింగ్‌ వహించనున్నట్లు తెలుస్తోంది. హాల్‌ తేజస్‌ల ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకులను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. నెల రోజుల్లో ఈ కమిటీ తన సమీక్షను పూర్తిచేసి ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమీక్ష సందర్భంగా దేశీయ వైమానిక రంగంలో ప్రైవేట్‌ రంగం పాత్రను బలోపేతం చేయడానికి వీలైన మార్గాలను కూడా అన్వేషించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో తేజస్‌ ఎంకే-1, ఎంకే-1ఏ, ఎం-2 వేరియంట్లలో 350 తేలికపాటి యుద్ధవిమానాలను ఆపరేట్‌ చేయాలని వాయుసేన లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

తేజస్‌ ప్రాజెక్టు కీలక పాత్ర

భారత ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో తేజస్‌ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోంది. అయితే,ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై వాయుసేన చీఫ్‌ తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ఏరో ఇండియా షోలో ఆయన మాట్లాడుతూ ''మా అవసరాలు,ఆందోళనలు మాత్రమే నేను వెల్లడించగలను. ప్రస్తుత పరిస్థితుల్లో హాల్‌పై పూర్తి నమ్మకం ఉంచే స్థితిలో లేను'' అని తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. జనవరిలో జరిగిన ఓ సదస్సులో కూడా ఆయన 2010లో ఆర్డర్‌ చేసిన 40తేజస్‌ యుద్ధవిమానాల డెలివరీ ఇప్పటికీ పూర్తికాలేదని విమర్శించారు. ప్రస్తుతం వాయుసేన వద్ద 36తేజస్‌ యుద్ధవిమానాలు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు 2021లో ఆర్డర్‌ చేసిన 83అప్‌గ్రేడ్‌ ఎల్‌సీఏ విమానాల కోసం ఇంకా వేచి చూస్తోంది.