Page Loader
Study in AP: విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఏపీ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యామండలి
ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యామండలి

Study in AP: విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఏపీ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యామండలి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

'స్టడీ ఇన్ ఏపీ' పేరిట ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులతో ఉన్నత విద్యామండలి విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల సహకారంతో విదేశాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్లను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకారవేతనాలు, ట్యూషన్ ఫీజు మినహాయింపులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. భారత్‌లో చదవడానికి వచ్చే విదేశీ విద్యార్థులకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ఆధ్వర్యంలో 21 రకాల ఉపకారవేతనాలు, ట్యూషన్ ఫీజు మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు 

ఫీజుల్లో రాయితీలు ఇస్తున్నప్రైవేటు వర్సిటీలు

గతంలో ప్రైవేటు వర్సిటీలకూ వీటిని అందించగా, అనంతరం మార్పులు తీసుకొచ్చి ప్రస్తుతం ఎన్‌ఐఆర్ ర్యాంకుల్లో 100 లోపు స్థానం ఉన్న లేదా నాక్-ఎ గ్రేడ్‌ కలిగిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీ విద్యార్థులకు మాత్రమే ఈ ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇంతేకాకుండా, స్టడీ ఇన్ ఇండియా, ఆయుష్ ఉపకారవేతనాల పథకాల ద్వారా కూడా ఉపకారవేతనాలు, పూర్తిగా ట్యూషన్ ఫీజు మినహాయింపులు లభిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు వర్సిటీలు తమకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఫీజుల్లో రాయితీలు ఇస్తున్నాయి. ఈ మార్గాలన్నింటినీ ఉపయోగించుకుని ఏపీకి విదేశీ విద్యార్థులను మరింతగా ఆకర్షించేందుకు ఉన్నత విద్యామండలి వ్యూహం రూపొందించింది.

వివరాలు 

ఏపీకి వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య వివరాలు 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 72 దేశాలకు చెందిన 3,730 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అత్యధికంగా నేపాల్‌కు చెందిన విద్యార్థులు 595 మంది ఉన్నారు. సుడాన్‌కు చెందినవారు 524 మంది, జింబాబ్వే దేశానికి చెందిన విద్యార్థులు 543 మంది ఉన్నారు. అలాగే, నేపాల్‌కు చెందిన మరొక 178 మంది విద్యార్థులతో పాటు, నైజీరియా నుంచి 154 మంది, ఇరాక్‌ నుంచి 127 మంది విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నారు.

వివరాలు 

ఉన్నత విద్యామండలి రూపొందించిన ప్రణాళిక 

విదేశీ విద్యార్థులను మరింతగా ఆకర్షించేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా: రాష్ట్రంలోని అర్హత కలిగిన విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను గుర్తించి, వాటిలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టనుంది. విద్యార్థుల ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. దీనివల్ల ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విద్యార్థులను మార్పిడి చేస్తారు. అధ్యాపకుల మార్పిడి (ఎక్స్చేంజ్) కార్యక్రమాన్ని కూడా చేపట్టనుంది.

వివరాలు 

ఉన్నత విద్యామండలి రూపొందించిన ప్రణాళిక 

ప్రపంచవ్యాప్తంగా QS ర్యాంకింగ్స్‌లో తొలి 500 స్థానాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలతో రాష్ట్రంలోని వర్సిటీలకు ఒప్పందాలు చేసుకునేలా సహాయ సహకారాలు అందించనుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారత్‌లో ఏర్పరచబోయే క్యాంపస్‌లలో ఒకటి లేదా రెండింటిని ఏపీలో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ఉన్నత విద్యామండలి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, విదేశీ వర్సిటీలు ఏపీలో తమ క్యాంపస్‌లు ఏర్పరచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నిర్ణయించింది.